ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 26 లక్షలకు చేరువైంది. కరోనా కారణంగా లక్షా 78 వేల మందికి పైగా మృతి చెందగా, 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. అయితే ప్రపంచంలో కరోనా కేసుల నమోదులో 20 వేలకు పైగా కేసులతో ఇండియా 17 స్థానంలో ఉందని తెలుస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఒక్క రోజులోనే ఈ రాష్ట్రాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగింది. లాక్ డౌన్ పొడిగించిన ఫలితంగా ఇతర దేశాల కన్నా ఇండియా కరోనా అదుపులో చాలా ముందంజలో ఉన్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కరోనా కేసుల నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 17.5 శాతానికి పెరిగిందని పేర్కొంది.