SARS-CoV-2 వైరస్ వల్ల కోవిడ్19 విజృంభిస్తున్నది. అయితే ఆ వైరస్ పుట్టకపై అమెరికా శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న SARS-CoV-2 వైరస్ కృత్రిమ వైరస్ కాదన్నారు. నేచర్ మెడిసిన్ మ్యాగ్జిన్‌లో ప్రచురితమైన ఓ కథనంలో ఈ విషయాన్ని తెలిపారు. టులేన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రాబర్ట్ గ్యారీ ఈ రిపోర్ట్‌ను తయారు చేశారు. చైనాలోని వుహాన్ మార్కెట్ నుంచి ఈ వైరస్ వ్యాప్తి అయిందన్న విషయాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. మా విశ్లేషణలు, ఇతరుల పరీక్షల ద్వారా ఈ విషయం స్పష్టమైందన్నారు.
వుహాన్‌లో వైరస్ కేసులు తొలుత వచ్చినా.. కానీ ఆ వైరస్ పుట్టింది అక్కడే అన్న ఆధారాలు లేవన్నారు. కరోనా మహమ్మారిగా విజృంభించడానికి డాక్టర్ గ్యారీ కొన్ని కారణాలు చెప్పారు. వైరస్‌లో ఉన్న ప్రోటీన్లు పరివర్తన (మ్యుటేషన్) చెందడం వల్లే.. ఆ వైరస్ ప్రమాదకరంగా మారిందన్నారు. అయితే ఎప్పటి నుంచో ఇలాంటి వైరస్ మనుషుల్లో ఉండి ఉంటుందని, కానీ అది గతంలో ఇంత తీవ్రంగా ప్రవర్తించి ఉండదని అన్నారు. కిరీటం తరహాలో స్పైక్‌లు ఉండడం వల్లే.. ఆ వైరస్‌కు కరోనా వైరస్ అని పేరు వచ్చినట్లు చెప్పారు. స్పైక్ ప్రోటీన్లు రెండు విశిష్టమైన లక్షణాలు కలిగి ఉన్నాయని, ఆ లక్షణాల వల్ల ఆ వైరస్‌లు మానవ కణాల్లోకి ప్రవేశిస్తాయని డాక్టర్ రాబర్ట్ తెలిపారు.