జిల్లా స్థాయిలో నిర్వహించే పంచాయతీ రాజ్ సమ్మేళనాల్లో కొత్తగా వచ్చిన పంచాయతీ రాజ్ చట్టంతో పాటు మున్సిపల్ చట్టంపై అవగాహన కల్పిస్తారు. కాగా, మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశంలో పల్లె ప్రగతి పై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి జిల్లాలో 30 రోజుల ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమాలపై వరుస సమీక్షలు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేశారు. రాష్ట్రంలోనే పల్లె ప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఆదర్శంగా నిలిచింది. అక్టోబర్‌లో నిర్వహించిన 30 రోజుల కార్యక్రమం, జనవరి మాసంలో నిర్వహించిన పల్లె ప్రగతిలో జిల్లా ఉన్నతాధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో సంఘటితంగా గ్రామాలను అద్భుతంగా తయారు చేశారు. పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనంపై ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులను అందజేస్తున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెలా రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు రూ.339 కోట్లను విడుదల చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు నిధుల వరద పారుతున్నది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామాలు అద్భుతంగా తయారవుతున్నాయి.